కురుక్షేత్ర మహాసంగ్రామానికి ముందు, అర్జునుడు తన ధర్మ రథంలో శ్రీకృష్ణునితో పాటు ప్రయాణిస్తున్నాడు. తన దానగుణం పట్ల గర్వపడుతున్న అర్జునుడు, “కృష్ణా, ఈ భూమండలంలో అత్యంత దాత ఎవరు?” అని ప్రశ్నించాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, “అర్జునా, అది కర్ణుడు” అని సమాధానమిచ్చాడు.
అర్జునుడు ఆశ్చర్యపోయాడు. “కర్ణుడా? అతను కాదు, నేనే అత్యంత దాతను” అని అన్నాడు. అర్జునుడి సందేహాన్ని నివృత్తి చేయడానికి, శ్రీకృష్ణుడు తన దివ్యశక్తితో రెండు బంగారు పర్వతాలను సృష్టించాడు.
“అర్జునా, ఈ బంగారు పర్వతాన్ని సూర్యాస్తమయం లోపు నీవు కలిసే వారికి దానం చెయ్యి” అని శ్రీకృష్ణుడు ఆదేశించాడు. అర్జునుడు ఉత్సాహంగా బయలుదేరాడు. దారిలో ఎంతో మంది బ్రాహ్మణులు, యాచకులు, పేదలు కనిపించారు. అర్జునుడు వారికి బంగారాన్ని దానం చేస్తూనే ఉన్నాడు. కానీ, సూర్యాస్తమయం అయ్యేసరికి, ఒక కొండలో కొంత భాగం కూడా దానం చేయలేక పోయినాడు, అప్పుడు అర్జునుడు కృష్ణుడితో “కృష్ణా! ఇంతకంటే ఈ భూమండలంలో ఎవరు దానం చేయలేరు” అని అన్నాడు.
మరుసటి రోజు, శ్రీకృష్ణుడు కర్ణుడిని పిలిచి, అర్జునుడికి ఇచ్చినట్లే రెండు బంగారు పర్వతాలని అతనికి ఇచ్చి దానం చేయమని కోరాడు. కర్ణుడు దారిలో ఇద్దరు బ్రాహ్మణులను కలిశాడు. వారు అతని వద్ద భిక్ష అడిగారు. కర్ణుడు వెంటనే, “ఈ బంగారు పర్వతాలని చెరో ఒకటి తీసుకోండి” అని చెప్పాడు. అది చూసిన అర్జునుడు కర్ణుడి గొప్ప తన్నని తెలుసుని, సిగ్గుపడి, తన తప్పు తెలుసుకొని, నిజమైన దాతృత్వం అంటే ఏమిటో గ్రహించాడు.
ఈ కథ ద్వారా శ్రీకృష్ణుడు మనకు నిజమైన దాతృత్వం యొక్క అర్థాన్ని బోధించాడు. నిజమైన దానం అంటే ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా, ఎలాంటి పరిమితులు లేకుండా ఇవ్వడం.