నిశిరాతిరి నిద్ర రాక
ఆరు బయట నులక మంచం మీద పడుకొని
నల్లటి ఆకాశంలో తెల్లటి చుక్కలు లెక్కపెడుతూ
నిద్ర లోకి జారుదామనుకుంటే
నులక మంచం పట్టి మంచం అయ్యింది
పట్టి మంచం పరుపు అయ్యింది
నక్షత్రాలు కాన రాలేదు! నిద్రా రాలేదు
పై పెంకుల మధ్యలోంచి
నక్షత్రాలు చూస్తూ
నిద్ర లోకి జారుదామనుకుంటే
పెంకులు రేకులు అయినాయి
రేకులు డాబా అయ్యింది
నక్షత్రాలు కాన రాలేదు! నిద్రా రాలేదు
గూట్లో దీపపు బుడ్డి చూస్తూ
రేడియోలో నాటకం వింటూ
అమ్మ కథకు ఊ కొడుతూ
నాన్న పాటకు జత కడుతూ
నిద్ర లోకి జారుదామనుకుంటే
దీపపు బుడ్డి, బెడ్లైట్ అయ్యింది
బెడ్లైట్ లెడ్లైట్ అయ్యింది
నక్షత్రాలు కాన రాలేదు! నిద్రా రాలేదు
నిద్ర నా దగ్గరకు వచ్చిందా నేను నిద్ర దగ్గరకు వెళ్లానా?
అని ఆలోచిస్తూ ఉండగానే
చీకటి వెలుగయ్యింది
వెలుగు బరువయ్యింది
బరువు బాధ్యత అయ్యింది
నక్షత్రాలు కాన రాలేదు! నిద్రా రాలేదు
భూమిని చీల్చితెనే గింజ
చెట్టు నరికితేనే కట్టే
కట్టే కాలితేనే మెతుకు
భయాన్ని చీల్చి,
బలహీనతను నరికి,
సందేహాన్ని కాల్చు!
బాధ్యత బలమవుతుంది
మనసు తేలికవుతుంది
నిద్ర బానిసవుతుంది