This post is also available in English
సాయంకాలం ఆరు గంటలు అయ్యింది విపరీతమైన తలనొప్పి, ఆకలిగా ఉంది, టీ తాగుదామని ఇంటికి వెళుతూ దారిలో ఉన్న హోటల్ దగ్గర ఆగాను. సైకిల్ స్టాండ్ లో పెట్టి లోపలి కి వచ్చాను. తలుపు పక్కనే ఒక బల్ల వేసుకొని ఒక లావుపాటి మనిషి లావు కళ్లద్దాలు పెట్టుకుని కూర్చొని ఉన్నాడు.
“టోకెన్ తీసుకోవాలా అండి” అని అడిగాను.
“అక్కరలేదు తిన్న తర్వాత డబ్బులు కట్టు బాబు” అన్నాడు.
“సరే” అని
రెండడుగులు ముందుకు వేసి పక్కగా ఉన్న టేబుల్ మీద కూర్చున్నాను. హోటల్లో జనాలు బాగానే ఉన్నారు ఒక పొట్టిగా నల్లగా ఉన్నతను దగ్గరకు వచ్చి గ్లాస్ తో నీళ్లు నా ముందు పెట్టి,
“ఏం తింటావ్ బాబు” అన్నాడు.
“ఇక్కడ ఏం బావుంటుంది” అని అడిగాను,
“ఒక్క క్షణం ఆలోచించి ఉల్లి అట్టు తింటావా” అన్నాడు,
“సరే” అన్నాను.
చేతిలో ఉన్న చిన్న కాగితం ముక్క మీద రాసుకొని లోపలికి వెళ్ళాడు, నేను ఒకసారి గొంతు తడుపుకొని, చేత్తో నుదుటి మీద రాసుకుంటూ కళ్ళు మూసుకున్నాను. ఒక 5 నిమిషాలకి టాక్ అని శబ్దం చేస్తూ పళ్ళెం ఒకటి నా ముందు పెట్టాడు, కళ్ళు తెరిచి చూడగానే ఎదురగా పల్చటి బంగారు రంగులో వేడి వేడిగా త్రికోనకరంలో అట్టు కనపడింది.
ఆ వాసన ముక్కు కి తగిలేసరికి ప్రాణం లేచి వచ్చింది. ఆ పళ్ళేనికి మూడు గుంటలు ఉన్నాయి ఒక దాంట్లో కొబ్బరి పచ్చడి, ఒక దాంట్లో అల్లం పచ్చడి ఇంకో గుంటలో చిన్న గిన్నెలో పొగలు వచ్చే సాంబారు ఉన్నాయి. ఆ అట్టుని మద్యలో తుంపీ, నాలుగు సన్నిటి ఉల్లిపాయ పలుకులు ఆ ముక్కలో పెట్టి, కొబ్బరి పచ్చడి లో ముంచి, కొంచెం అల్లం పచ్చడి అద్ది నోట్లో పెట్టుకోగానే, నా నాలుకా, మనసు రెండిటికి ఉత్సాహం వచ్చింది. అవురు అవురు మంటూ రెండు నిమిషాలలో మొత్తం అట్టు తేనేశాను. పళ్లెంలో చేతులు కడుగుతుంటే
“కాఫీ తాగుతావా” అని అడిగాడు,
“టీ” అని అన్నాను,
“ఇక్కడ కాఫీ బాగుంటుంది” అన్నాడు
నేను “సరే” అన్నాను.
వేడి నురగల కాఫీ తాగుతుండగానే చిన్న కాగితం మీద తొమ్మిది రూపాయలు అని రాసి బల్ల మీద పెట్టి, ఎగిరిపోకుండా ఒక చుక్క నీళ్ళు కాగితం మీద వేసి వెళ్ళిపొయాడు. కాఫీ తాగిన తర్వాత తలకాయ నొప్పి ఎగిరి పోయింది, డబ్బులు కట్టేసి హుషారు గా బయటకు వచ్చి సైకిల్ తీసుకొని ఇంటికి చేరాను.
అది నేను కొత్త గా బెంగళూరు వచ్చిన రోజులు, కొత్త ఉద్యోగం, కొత్త ఊరు, కొత్త మనుషులు. ఇంకా ఇల్లు కుదరలేదు పేయింగ్ గెస్ట్ గా ఒక హాస్టల్ లో ఉంటునాను. ఎనిమిది అవుతోంది ఇంటికి వెళ్దామ అన్నాడు ప్రకాష్. సరే అని కంప్యూటరు లాక్ చేసి లేచాను.
ప్రకాష్ కూడా బెంగళూరు కొత్త గా వచ్చాడు ఇద్దరం ఒకే హాస్టల్ లో ఉంటున్నాం. బయటకి వస్తుంటే కుమారి గారు కూడా కనిపించారు ముగ్గరం కలిసి నడుచుకుంటూ బయటకి వచ్చాం. కుమారి గారి హాస్టల్ కూడా మా హాస్టల్ దగ్గరే. హాస్టల్ కి వెళ్తూ ఉంటే మద్యలో ఒక రేకుల షెడ్డులో బల్ల మీద కూర్చొని కొంత మంది తింటూ కనిపించారు.
“ఇక్కడ దోశ బాగుంటుంది అండి” అని అన్నారు కుమారి గారు
“సరే” అని ముగ్గురమ్ లోపలికి వెళ్ళాం,
అక్కడ బడిలో లాగా రెండు బల్లలు వేసి ఉన్నాయి ఒక దాంట్లో కూర్చున్నాం.
“బాగుండారా” అని కుమారి గారి ని పలకరించింది ఆ హోటల్ నడుపుతున్న ఆవిడ.
ఆవిడకి ఒక ముప్పయి నలబై మద్యలో ఉంటుంది వయసు. ఆవిడ మాట బట్టి తమిళనాడు కు వలస వెళ్ళిన తెలుగు కుటుంబంలాగా అనిపించింది.
“నాకు మసాలా దోశ కావాలి” అన్నారు కుమారి గారు,
“మీకు సార్” అని మా వైపు చూసింది ఆవిడ
“నాకు ఎగ్ దోశ” అన్నాడు ప్రకాష్
“ఉల్లి దోశ” ఉందా అని అడిగాను
“ఉంది సార్” అని
అక్కడ అట్లు వేస్తున్న వాళ్ళ నాన్నతో “ఒరు మసాలా, మొట్ట, ఆనియన్” అంది.
మేం ముగ్గురం బెంగళూరు విశేషాలు మాట్లాడుతుంటే ఒక పది నిమిషాలకి మా ముందు మా దోశలు ప్రత్యక్షం అయినాయీ. నా పళ్ళెం లో అట్టు చూసి నేను కొంచెం ఖంగు తిన్నాను,
“అది ఏమిటి నేను ఉల్లి అట్టు చెప్పాను ఇది ఊతప్పం కదా” అన్నాను.
ఆ హోటల్ ఆవిడ ఆశ్చర్యం గా న వైపు చూసి “ఇది ఆనియన్ దోశ సార్ అని చెప్పింది”.
ఒక్కసారిగా నాకు నీరసం వచ్చింది సరే అని ఏదో ఒకటిలే అని తినేసి చేతులు కడుక్కొని డబ్బులు ఇచ్చేసి రూముకి చేరాము.
నాలుగు రోజుల తర్వాత ఒక శనివారం సాయంత్రం భోజనానికి బయటకు వెళ్ళాను, ఈ సారి సాయి భవన్ అని ఒక మంచి కర్ణాటక హొటెలు. టోకెన్ తీసకొనేయప్పుడు ఆనియన్ దోశ అని అడిగాను
“అరవై రూపాయలు” అన్నాడు
వంద కాగితం ఇచ్చి దోశలో ఉల్లిపాయ వేస్తారా అని అడిగాను, టోకెన్ ఇచ్చే అతను నా వైపు విచిత్రం గా చూశాడు, వీడికి ఏమయినా పిచ్చ ఆనియన్ దోశలో ఆనియన్ వేయక టమాటా వేస్తార అన్నట్టుగా చూశాడు. పక్కనే ఉన్న ప్రకాష్ కూడా వెర్రి మొహం వేశాడు ఇద్దరం టోకెన్ కౌంటర్లో ఇచ్చి నుంచొని ఉన్నాం. అయోమయంగా నా వైపు చూస్తునా ప్రకాష్ కి చెప్పాను
“మా ఊళ్ళో ఉల్లిదోశ అంటే మామూలు దోశలో మసాలా దోశలాగా మద్యలో ఉల్లిపాయలు వేస్తారు. ఇక్కడ దోశ మందంగా వేసి దాంట్లో ఉల్లిపాయలు కలుపుతారు మా దగ్గర దానిని ఊతప్పం అంటారు”
అని చెప్పి ఆయన అయోమయాన్ని నివృత్తి చేశాను. ఇలా నెలలు గడిచాయి, ప్రతి సారి ఉల్లి అట్టు చెప్పడము నేను ఉల్లిపాయ వేస్తార అని ఆడగటము పరిపాటి అయిపోయింది.
కొన్ని రోజులకి సాయి భవన్లో పైన రూమ్లో సర్విస్ మొదలు పెట్టారు. ఒక ఆదివారం నేను, ప్రకాష్, కుమారి గారు రాత్రి భోజనానికి వెళ్ళాం. కూర్చొని వైటర్ కోసం ఎదురు చూస్తూ పిచ్చ పాటి మాట్లాడుకుంటునాము. మేము తెలుగు లో మాట్లాడకోవటం చూసిన అక్కడి సర్వరు మమ్మల్ని చూసి
“సారు మీది ఎక్కడండి ఆంధ్రాలో” అని విచ్చుకున్న మొహం లో అడిగాడు.
నేను “మాది బందరు” అని చెప్పాను,
ఆ మాట వినేసరికి అతనికి మరింత హుషారు వచ్చింది,
“నేను విజయవాడ లో 5 సంవత్సారలు పనిచేశాను అండి మీ ఊరు బీచి కి రెండు మూడు సార్లు వచ్చాను మీ ఊళ్ళో భోజనం చాలా బాగుంటుంది” అని చెప్పాడు.
ఆ మాట వినేసరికి నాకు ఒక చిన్న ఆశ కలిగింది
“ఏమయ్యా ఎప్పుడయినా బెజవాడ లో గాని బందర్ లో కానీ ఉల్లి అట్టు తిన్నవా” అనీ అడిగాను.
“ఎందుకు తినలేదండి ఉల్లి రోస్ట్ నేను పనిచేసిన హోటల్ లో బాగుంటుంది” అని చెప్పాడు.
నేను “అవునయ్య అలాంటి అట్టు తిని రెండు ఏళ్లు అయ్యింది అని నిటుర్చాను”.
“అవును సార్ ఇక్కడ అలా కాల్చారు అన్నాడు.”
మేను కార్డ్ మాకు ఇచ్చి లోపలికి వెళ్ళాడు, ఒక రెండు నిమిషాలకి బయటకు వచ్చి.
“సార్ మీకు కావాలి అంటే ఇప్పుడు ఆనియన్ దోస వేస్తాను” అన్నాడు.
నాకు పట్టరాని ఆనందం వేసింది వెంటనే “సరే” అన్నను.
కాసేపటికి ఒక పెద్ద పళ్ళెంలో త్రికోణం లో ఉన్న ఉల్లి అట్టు నా ముందు ప్రత్యక్షం అయ్యింది. నా ఆనందానికి హద్దు లేదు, గబ గబ ఆ అట్టుని లాగించేసి, ఇంకోటి తెప్పించుకొని తిని తృప్తి పడ్డాను. అతనికి, నా కృతజ్ఞతగా ఒక యాబై చేతులో పెట్టి బిల్లు కట్టేసి బయటకి వచ్చాము. ఇంటికి వెళ్తూ ఉండగా
“నీది మరి విడ్డూరమయ్య ఆనియన్ దోశని అంతా మిస్ అవుతునవా” అన్నాడు ప్రకాష్,
నేను నవ్వి “అదేంలేదు ప్రకాష్ దీని వెనకాల ఒక పిట్ట కథ ఉంది” అని అన్నాను.
“అవునా ఏమీటది” అన్నాడు కుతూహలంగా.
“ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం, నేను చదువుకొనే రోజుల్లో ఒక హోటల్ ఉండేది అక్కడ ఒక సర్వర్ ఉండేవాడు మొదటిసారిగా అతనిని కలిసినప్పుడు నాకు ఒక ఉల్లి దోశ రికమెండు చేశాడు. అది చాలా బాగుంది. అపట్నుంచి ఆ హోటల్కి రోజు వెళ్ళటం అలవాటు అయ్యింది. ఆ సర్వరు నేను పెద్ద గా మాటలాడుకోకపోయినా, ప్రతి రోజు ఏదో ఒక టిఫిన్ తెచ్చి పెట్టవాడు నేను తినే వాడిని. కొంత కాలం తర్వాత నేను అసలు ఏమి అడిగే వాడిని కాదు, అతను ఆ రోజు ఏమి బాగుందో అది తెచ్చి పెట్టివాడు. మా ఇద్దరికీ ఒక తెలియని స్నేహం ఏర్పడింది. నేను అనుకోవటం మా అమ్మ తర్వాత నాకు ఏమి ఇష్టమో అతనికే తెలుసు. కొంతకాలానికి నా చదువు పూర్తి అయ్యిన తర్వాత నేను బయటకు వచ్చేశాను. ఎప్పుడు ఉల్లి అట్టు తిన్న ఆ పాత జ్ఞాపకాలతో నా మనసు ఉత్సాహంగా ఉంటుంది అతని మొహం నాకు గుర్తుకు వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి ఉల్లి అట్టు దొరకలేదు. ఇలాగే ఉంటే నా జ్ఞాపకాలన్నీ మార్చి పోతాను ఏమో అని భయం వేసింది, ఇవ్వాళతో ఆ భయం పోయింది అన్నాను.”
ఒక సారి ఒక చిన్న పలకరింపు, సన్నని చిరునవ్వు ఎంతో ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయి, అవతలి వారు మనకున్న సమస్యని పరిష్కరించలేకపోవచ్చు. కానీ వాళ్ళు నవ్వు, పలకరింపు, మనకి సమస్యని ఎదుర్కొనే ధైర్యాన్ని శక్తిని ఇస్తాయి